Search
Close this search box.

పదేండ్ల ఇదే మొత్తుకున్నాం…

కేసీఆర్‌ పేరు తీయకుంటే బతుకుదెరువు లేదా?

ముఖ్యమంత్రిగారూ.. కేసీఆర్‌ పేరు చెప్పకపోతే బతుకుదెరువు లేదా సర్‌? మోదీగారి పేరుతీయడానికి కూడా ఎందుకు భయపడుతున్నడు ముఖ్యమంత్రి?

అంత భయమెందుకు సర్‌. అందుకే మేమనేది అధ్యక్ష.. ఇవ్వాల నోటికొచ్చినట్లు మాట్లాడితేకాదు! తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలె! ఎనిమిది ఎంపీలున్నా.. తెచ్చింది గుండు సున్నా! ఆరుగ్యారెంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదనాం చేయడం.. రాష్ట్రం దివాలా తీసిందని బదనాం చేసినా తప్పించుకోరు.

– కేటీఆర్‌

కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని, విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ లేకపోవడం వల్లనే రాష్ర్టానికి ఇంత అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు చెరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చినా, ఆ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం లేదని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్యలో బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ మాట్లాడారు.

రాష్ర్టానికి కేంద్రం సాయం చేసే విషయంలో గత పదేండ్లుగా జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతూనే ఉన్నదని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంచేశారు. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై చర్చను బీఆర్‌ఎస్‌ పూర్తిగా స్వాగతిస్తున్నదని, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. పదేండ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పామో, ఇప్పుడు కాంగ్రె స్‌ ప్రభుత్వం కూడా అదే చెప్తున్నదని వివరించారు.

గతంలో తాము చెప్తే పట్టించుకోలేదని, కేసీఆర్‌ పం చాయితీ వల్లే రాష్ర్టానికి నిధులు రాలేదంటూ కాంగ్రె స్‌ నేతలు ఆరోపించారని గుర్తుచేశారు. తాము బీఆర్‌ఎస్‌లా కాదని, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించి నిధులు తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా కేటీఆర్‌ ఉటంకించారు. ప్రధానిని బడేభాయ్‌ అన్నప్పటికీ ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి తమ వరకు వస్తే గానీ అసలు త త్వం బోధపడిందని అన్నా రు.

బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ జెండా లేకపోవడమే కారణమని చెప్పారు. మ్యాథ్స్‌ లో 8+8=16 అయితే కాంగ్రెస్‌, బీజేపీ లెక్కలో మాత్రం 8+8=0 అని ఎద్దేవా చేశారు. 2 పార్టీలకు 16 ఎంపీ సీట్లు ఇచ్చినా రాష్ర్టానికి న్యాయం జరగలేదని విమర్శించారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేశామని, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తుచేశారు. మోటర్లకు మీటర్లు, కాజేపీటకు కోచ్‌ ఫ్యాక్టరీ, ఓబీసీ కులగణన, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై ప్రశ్నించడంతోపాటు వ్యతిరేకించినట్టు తెలిపారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పినట్టుగా ‘యాచిస్తే రాదు.. శాసిస్తేనే వస్తది’ అనే సిద్ధాంతంతోనే తెలంగాణ సాధించామని, ఇకపై కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేదని, దేశంలో తెలంగాణను ఆగ్రగామిగా నిలిపామని వివరించారు. సందర్భాన్ని బట్టి కేంద్రానికి మద్దతు ఇచ్చామని స్పష్టంచేశారు. అదానీకి, కేంద్రం ఒత్తిడికి లొంగిపోవద్దని, డిస్కంలను ప్రైవేటుపరం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

బడ్జెట్‌లో పంజాబ్‌కు అన్యాయం జరిగితే అక్కడి ఎంపీలు రోడ్డెక్కి ధర్నా చేస్తే కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రం మొఖం చాటేశారని విమర్శించారు. తమ రాజ్యసభ ఎంపీలను కూడా పంపిస్తామని ఢిల్లీలో పోరాటం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయకుండా ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో పోరాటంలో కాంగ్రెస్‌ కలిసిరాలేదని, కానీ తాము ఆ తప్పు చేయబోమని స్పష్టంచేశారు. మీతో వస్తాం.. కలిసి కొట్లాడుదామని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించారు.

బీజేపీని విమర్శిస్తే కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించా రు. సీఎం రేవంత్‌రెడ్డి చిన్న వయసులోనే సీఎం అ య్యారని, అంత అసహనం పెంచుకోవద్దని హితవు చెప్పారు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు చేసుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్‌ఎస్‌ పని చేస్తుంది. ఏ విలీనం, ఏ చీకటి ఒప్పందాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏం చేసినా బాజాప్తా చేస్తాం. మీ లాగా మేము మోదీ పేరు తీసుకోవడానికే భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ కూడా సీఎం పనులను ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చకబెడుతున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు. మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతాం. 2014లో కాంగ్రెస్‌లో విలీనమవుదామని అనుకున్నాం.

దిగ్విజయ్‌సింగ్‌ వైఖరి వల్ల చేయలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం అని మాట్లాడుతున్నారు. 8 మంది ఎంపీలను కాంగ్రెస్‌కు ప్రజలు ఇస్తే మీరు రాష్ట్రానికి తెచ్చింది గుండుసున్నా. దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. సీఎం సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రభుత్వమే ప్రకటిస్తే.. బయట రూపాయి అప్పు దొరకదని చెప్పారు. కేసీఆర్‌పై కోపంతో రాష్ర్టాన్ని నాశనం చేయొద్దని, అది మీకే నష్టమని హెచ్చరించారు. రాష్ర్టానికి ఐటీఐఆర్‌ ఇవ్వాల్సిందేనని, ఆ ప్రా జెక్టును కాంగ్రెస్‌ తెస్తుందో, చస్తుందో ప్రజలు చూస్తారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల అమలు వరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని స్పష్టంచేశారు.

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. ప్రజలకు మీరు ఏమిచ్చారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, వికసిత్‌ భారత్‌ అంటే, సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అంటే కేవలం ఏపీ, బీహార్‌ రాష్ర్టాలేనా? అని ప్రశ్నించారు.

రాష్ర్టానికి రావల్సిన నిధులు, అనుమతులు, ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 27న ప్రధాని ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం దక్షిణాది రాష్ర్టాలపై ముఖ్యంగా తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే.. కేవలం 47 పైసలే కేంద్రం తిరిగి ఇస్తున్నదని చెప్పారు. బీహార్‌ రాష్ట్రం రూపాయి ఇస్తే.. వారికి రూ.47 ఇస్తున్నదని వివరించారు.

ఐదేండ్లలో ఉత్తరప్రదేశ్‌ రూ.3.41 లక్షల కోట్లు ఇస్తే.. వారికి కేంద్రం రూ.6.91 లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ స్థాయిలో తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ఐదేండ్లు దక్షిణాది రాష్ర్టాలపై బీజేపీ కక్ష గట్టిందని, దక్షిణాది రాష్ర్టాలు కేంద్రానికి 22.26 లక్షల కోట్లు ఇస్తే.. తిరిగి 6.91 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. ప్రధాని లక్ష్యం గా పెట్టుకున్న 5 ట్రిలియన్‌ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశానికి అత్యధికంగా నిధులిస్తున్న తెలంగాణను ఆదుకోవాలని కోరారు.

ట్రిపుల్‌ఆర్‌, మెట్రో, మూసీ, నీటి సమస్యలు, ఫార్మాసిటీ, ఐఐ ఎం, గిరిజన యూనివర్సిటీ, కోచ్‌ఫ్యాక్టరీ, ఉక్కుఫ్యాక్టరీ వంటి వాటికి నిధులు, నీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ప్రధాని అధ్యక్షుడిగా నిర్వహించే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సభ సాక్షిగా తెలిపారు. ఈ విషయంలో అన్ని పక్షాలు కలిసి వస్తే.. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని చెప్పారు. తన తీర్మానాన్ని అందరూ ఏకీభవించాలని విన్నవించారు. దీంతో సభంతా చప్పట్ల ద్వారా తమ ఆమోదాన్ని తెలిపారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

బడ్జెట్‌లో రాష్ర్టానికి నిధులు ఇవ్వకపోవడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫెడరల్‌ వ్యవస్థలో న్యాయంగా రాష్ర్టాలకు రావాల్సిన వాటాను హక్కుగా అడుగుతున్నామని చెప్పారు. నిధుల కేటాయింపులో కేంద్ర వివక్షాపూరిత వైఖరిపై ప్రమాదకర సంకేతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై భట్టి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కాదని పేర్కొన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్‌ నేత లు మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను కలుపుకొని ధర్నా చేద్దాం, ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేద్దామని చెప్పారు. రాష్ర్టానికి నిధులు, అనుమతులు, ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షం వస్తానంటే ఢిల్లీకి తీసుకెళ్తామని అన్నారు. ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుద్దామని, కేసీఆర్‌ కూ డా వస్తానంటే తీసుకుపోతామని భట్టి చెప్పా రు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ఒక్క ఏపీకే కాదని, తెలంగాణకు కూడా వర్తిస్తుంద ని, అయినప్పటికీ కేంద్రం ఏపీపై ప్రేమ చూపి తెలంగాణను విస్మరించడం దారుణమని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి