అత్యతంత సుందరగా ఆలయ అలంకరణ
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
సిసి కెమెరాల ఏర్పాటు..పటిష్ట బందోబస్తు
ఆదివారం జరుగనున్ను సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత రెండు మూడు రోజులుగా పలువురు మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.తెలంగాణ దశాబ్ది బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో చెక్కుల పంపిణీ పూర్తయిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 10 శాతం అదనంగా కేటాయించినట్లు చెప్పారు. ఈనెల 28న లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భాగ్యలక్ష్మీ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, విూరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జిమండి నల్లపోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సరూర్‌నగర్ ఎన్టీఆర్ నగర్‌లోని ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క, నాచారం ఉప్పల్ మహంకాళి సహిత మహా కాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహాకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నిర్వాహకులు ఆహ్వానించారు. మహాకాళి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ శుక్రవారం తెలిపారు. సుమారు 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 400 సీసీ కెమెరాలతో పాటు మహాకాళి ఠాణాలో ప్రత్యేక జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆది, సోమవారాల్లో 24 డిపోల నుంచి సికింద్రాబాద్‌కు మొత్తం 175 బస్సులను నడుపుతున్నట్టు వెల్లడిరచింది. భక్తుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ` 99592 26147, జేబీఎస్ ` 99592 26143, ఎంజీబీఎస్ ` 99592 26130 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని వివరించారు.సికింద్రాబాద్‌లో ఈ నెల 21న బోనాల వేడుకల్లో పాల్గొనాలని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఆహ్వానించారు.ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు.