- ఇంద్రపాలెం విలీనంలో ప్రతిబంధకాలు తొలగించాలి
- విలీన సాధనకు స్థానిక పౌర ప్రతినిధుల తీర్మానం
కాకినాడ, జూలై 14 : పౌర సౌకర్యాలు లేకుండా 13 ఏళ్ల నుండి నిర్వీర్యం అవుతున్న 8 అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా తయారయ్యిందని నగరాన్నిఆనుకుని వున్నప్పటికీ తమ గ్రామం మీదుగా కార్పోరేషన్ పైపులైన్లు ఉన్నప్పటికీ త్రాగునీరు కరువయ్యిందని ఇటువంటి వెతలు అడుగడుగునా వున్నాయని ఇంద్రపాలెంలో జరిగిన పౌర ప్రతినిధుల సమావేశం పేర్కొంది. 2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినందున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించి తూర్పు గోదావరి జిల్లాలో గ్రేటర్ రాజమహేంద్ర వరాన్ని ఏర్పాటు చేసినట్టుగా కాకినాడ జిల్లాలో 8గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటు కు గవర్నర్ ఆర్డినెన్సు తీసుకువచ్చే ప్రక్రియకు కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమాయత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పార్టీలకతీతంగా ఇంద్రపాలెం పౌర సౌకర్యాల ప్రగతి పురోగతి కోసం ప్రజాఉద్యమంగా న్యాయపోరాటంగా భవిష్యత్ కార్యాచరణకు తగిన వ్యూహం కొనసాగించాలని తీర్మానించారు. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇంద్రపాలెం పార్కులో మేడిశెట్టి రామోహన్ అధ్యక్షతన స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు. సమావేశాన్ని చిట్టూరి విజయకుమార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వరరావు (నానాజీ) చేతుల మీదుగానే సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలల ముందు తగిన కార్యాచరణ ఉద్యమం జరిగిందని, అదే రీతిగా ప్రభుత్వ పెద్దల సమక్షానికి వంద రోజుల ప్రణాళికగా ప్రతి గ్రామం నుండి పోస్టుకార్డుల ఉద్యమం గ్రామీణాభివృద్ధి మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు, మున్సిపల్ మంత్రి పి.నారాయణకు, జిల్లా కలెక్టర్ కు, హైకోర్టు ధర్మాసనానికి గ్రామ వెతల నివేదన కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుతో రాజధానిలో సిఎం కార్యాలయానికి ర్యాలీ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలుచేసే న్యాయపోరాటం జరుగుతుందన్నారు. స్థానిక తెదేపా అధ్యక్షులు పండూరు జయకృష్ణ, జనసేన అధ్యక్షులు దొడ్డిపట్ల అప్పారావు, వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షులు పలివెల శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు గవర శ్రీరాములు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కముజు నెహ్రూ, మాజీ సభ్యులు మరుకుర్తి నాగబాబు, అఖిల పక్షం కన్వీనర్ చింతపల్లి ఉదయ భాస్కర్, మనవూరు మన బాధ్యత ప్రతినిధులు, ఎస్.ఎఫ్.ఐ.డి.వై.ఎఫ్.ఐ. యువ నాయకులు వాసు. సోహిత్, వాసంశెట్టి చంద్రరావు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, తూరంగి, వలసపాకల ప్రతినిధులు జోగ అప్పారావు, సలాది శ్రీనివాసబాబు, మేడిశెట్టి వేంకటరమణ పాల్గొ న్నారు. త్వరలో స్థానిక సాధన సమితి బృందం ఏర్పాటవుతుందని ప్రకటించారు.