రెండో విడత రుణమాఫీ ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన సిఎం రేవంత్
అర్హులకు లక్షన్నర రుణమాఫీ కింద నిధులు విడుదల
6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల
రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం అన్న సిఎం రేవంత్
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆయన.. గత పదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, సాగుకోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఇప్పటికే రూ.లక్ష ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనం కాదు… రైతు ప్రయోజనం ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని.. గత ప్రభుత్వం 60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ కూడా పూర్తిచేయలేకపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.25వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారని.. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందేనని ప్రణాళికలు రచించాం.. నిధులు సేకరించామని తెలిపారు నిధుల సవిూకరణ చేసి ఇవాళ రెండో విడతలో రూ.6,198కోట్లు ఆరున్నర లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నామని.. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత అని ప్రకటించారు. నెహ్రూ ఆనాడు హరిత విప్లవం తీసుకు వచ్చారని.. జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లిందని రేవంత్ తెలిపారు. పేద రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయకరణ చేశారని.. సోనియమ్మ నేతృత్వంలో ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చారని తెలిపారు. ఆనాడు రూ.72వేల కోట్లు రుణాలు మాఫీ చేసి దేశంలో రైతులను ఆదుకుంది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. అప్పుడు .. ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతేనన్నారు. నెల తిరిగేలోగా 1.5లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని.. అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు. జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలు. దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రికార్డు సృష్టించిందన్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని.. గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆరునెలల్లో ఆర్ధిక మంత్రి రూ.43 వేల కోట్లు వడ్డీ చెల్లించారని ఆరోపించారు. 12 రోజుల్లోనే రుణమాఫీకి 12వేల కోట్లు సేకరించిన ఆర్ధిక మంత్రి, వారి సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. అసెంబ్లీ
సమావేశాలు జరుగుతున్నందున రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసేందుకు అసెంబ్లీలోనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతులు, పంట పొలాలు, పంటలకు సంబంధించిన ఆంశాలతో ఆకర్షణీయం గా ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి కార్యక్రమం పూర్తి చేశారు. గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోకూడదనేదే మా విధానం. అందుకే ఇవాళ రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశాం. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హావిూ మేరకు రైతులకు రుణమాఫీ చేశాం. రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేశాం.‘ అన్నారు. రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేశారు.
గత ప్రభుత్వంలో పూర్తిగా మూలనపడ్డ పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి… ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హావిూని నిలబెట్టుకున్నామన్నారు. ఒకే పంటకాలంలో రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఆయిల్‌పామ్ సరఫరాలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ రైతులకు ఇచ్చిన హావిూలు నిలబెట్టుకుంటున్నాం. ఆగస్టులో రూ.2 లక్షల్లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తాం. పంటలబీమా ద్వారా రైతులకు అండగా ఉంటాం. త్వరలోనే గతంలో కంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తాం. ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ వేయాలని కోరుతున్నాం. అనేక రాష్టాల్రకు పామాయిల్ సరఫరా చేసే స్థాయికి మనం చేరాలి. రైతేరాజు అనే నినాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన అర్థం చెబుతోందని తుమ్మల అన్నారు. రాహుల్ గాంధీ హావిూలు ఇచ్చినప్పుడు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతుల మేలుకోరే రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రెండో విడతగా రుణమాఫీ పొందిన లబ్దిదారులకు ఆయన అభినందనలు తెలిపారు