భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల తరఫున టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ మాజీ షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించనున్నారు. చెఫ్ డి మిషన్‌గా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఎంపిక కాగా.. ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో గగన్‌కు అవకాశం వచ్చింది. ‘మేరీ కోమ్ స్థానంలో ఒలింపిక్ పతకం గెలిచిన యువ అథ్లెట్ కోసం చూస్తుండగా.. గగన్ పేరును మా సహచరులు సూచించారు. మేరీకి గగన్ సరైన ప్రత్యామ్నాయం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్ సింధు, దిగ్గజ టీటీ ప్లేయర్ శరత్ కమల్ పారిస్‌లో పతాకధారులుగా వ్యవహరిస్తారు’అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు.