పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ నిబంధనలు పాటించకుండా అనధికార బయో డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలియదా, “రవాణా ప్రయోజనాల కోసం హై-స్పీడ్ డీజిల్‌తో కలపడం కోసం బయో-డీజిల్ అమ్మకానికి సంబంధించిన మార్గదర్శకాలు-2019” బయోడీజిల్ అమ్మకాలను విస్తృతంగా కవర్ చేయలేదనేది నిజమేనా, అలా అయితే దాని వివరాలు దానికి గల కారణాలు మరియు పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకొంటున్న చర్యల వివరాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖా సహాయ మంత్రి సురేష్ గోపి సమాధానం ఇస్తూ దేశంలో బయోడీజిల్ పేరుతో అనధికారికంగా బయోడీజిల్‌ను విక్రయించడం, పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే “రవాణా ప్రయోజనాల కోసం హై-స్పీడ్ డీజిల్‌తో కలపడం కోసం బయోడీజిల్ అమ్మకానికి మార్గదర్శకాలు-2019” జారీ చేసిందని తెలియజేసారు.
ఈ మార్గదర్శకాలు బయోడీజిల్ విక్రయాలను నియంత్రణలో ఉంచుతాయని, బయోడీజిల్‌ను విక్రయించే రిటైల్ అవుట్‌లెట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అధికారం ఉంటుందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు కూడా అనధికారకంగా, అక్రమ బయోడీజిల్ తయారీ ప్లాంట్లు, నిల్వ, పంపిణీ యూనిట్లు, రిటైల్ అవుట్‌లెట్‌లను తనిఖీ చేయడం తోపాటుగా స్వాధీనం చేసుకోవడానికి అధికారం ఉంటుందని అన్నారు. అంతే కాకుండా బయోడీజిల్ అక్రమ విక్రయాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగిందని తెలియజేసారు. దేశంలో బయోడీజిల్ పేరుతో విక్రయించబడుతున్న అక్రమ పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించకుండా నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారుల తోపాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక తనిఖీలు, దాడులు నిర్వహించాయని తెలియజేసారు.