ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా (Canada) పార్లమెంట్ దిగువసభలో మౌనం పాటించి నివాళులర్పించడంపై అధికార పక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య తాజాగా ట్రూడో నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన చర్య ఎంతో మంది గౌరవనీయులైన కెనడా వాసుల ఉన్నతత్వాన్ని దెబ్బతీసిందన్నారు. గతంవారం హౌస్ కామన్స్ నిజ్జర్‌కు నివాళులర్పిస్తూ కొన్ని నిమిషాలు మౌనం పాటించడం ఏమాత్రం సరికాదని చంద్ర అభిప్రాయపడ్డారు. అతడికి వేర్పాటు వాదులతో సంబంధాలున్నాయని కెనడా ఆందోళన చెందినట్లు గత వారం గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఇన్వెస్టిగేషన్ కథనంలో పేర్కొన్న విషయాన్ని ఉటంకించారు. ఆయన సదరు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” జీవిత కాలం కెనడాకు సేవ చేసిన అతి కొద్ది మంది గొప్పవారికి ఇచ్చే అరుదైన గౌరవం అది. నిజ్జర్ ఆ కోవకు చెందిన వ్యక్తికాదు. విదేశీ ప్రభుత్వం హత్య చేసిందంటూ చెబుతున్న ‘నమ్మదగిన ఆరోపణలు’తో మాత్రమే అతడిని గౌరవనీయులైన కెనడా వాసుల సరసన చేర్చడం తప్పు” అని అని పేర్కొన్నారు.
ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం గత మంగళవారం ప్రత్యేకంగా నివాళులర్పించింది. ఏకంగా దేశ పార్లమెంటులోని దిగువ సభలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించగా ఎంపీలందరూ నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యులందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినందున నిజ్జర్ జ్ఞాపకార్థం మౌనం పాటించామని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ నాడు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ట్రూడో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ అధికారికంగా నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేసింది. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.