ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ ప్రయత్నాలకు చేయూతనిచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో వేగంగా ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి భారత్ మండపంలో నిర్వహించిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి మేం నిరంతరం మద్దతుగా నిలుస్తాం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 57% ఓట్లు, 164 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈవిషయంలో రాష్ట్ర ప్రజలు తమ బాధ్యత నెరవేర్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించి వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందుకు ఐదు ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా’ అని పయ్యావుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక నోట్ సమర్పించారు.
1. రాష్ట్ర అభివృద్ధికి సాయం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం, వారసత్వంగా వచ్చిన అప్పుల భారం ఇందుకు కారణం. ఇప్పుడు మూలధన వ్యయాన్ని ఉత్పాదకంగా ఖర్చుచేయడంతో పాటు మౌలిక వసతుల కల్పన ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలి.
2. అమరావతి ప్రాంత అభివృద్ధి: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం 2024-25 బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల గ్రాంటు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
3. పోలవరం: ఈ బహుళార్థకసాధక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సాగునీరు, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తిపరంగా రాష్ట్రం స్వావలంబన సాధించగలుగుతుంది. దీన్ని వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
4. వెనుకబడిన జిల్లాలకు నిధులు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలను ఆదుకోవాలి. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని రాష్ట్ర విభజన సమయంలోనే గుర్తించినందున ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలి.
5. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన: రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాలో రెండు నోడ్స్, బెంగళూరు-హైదరాబాద్ పారిశ్రామిక నడవాలో ఒక నోడ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. రాష్ట్రానికి మెగా టెక్స్‌టైల్‌పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్‌ను మంజూరు చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి.