తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వానలు
విశాఖ జిల్లాను వదలని వర్షాలు
తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం ఇవాళ, రేపు ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య, తూర్పు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, రామకృష్ణా థియేటర్ రోడ్డు, వెలమ వీధి, పూర్ణా మార్కెట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్ఞానాపురం పాతవంతెన వద్ద వరదనీరు నిలిచిపోయింది. విశాఖ ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల లోతు నీటిలో వాహనాలు నడుపుతూ అవస్థలు పడ్డారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.