పిఠాపురం, జూలై 21 : మానవుడు గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని మానవుని జీవన విధానానికి దశ, దిశ నిర్దేశించే తాత్వికుడు గురువు అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆలీషా ప్రసంగించారు. గురువును పూజిస్తూ గురువు ఔన్నత్యాన్ని గ్రహిస్తూ గురుతత్వాన్ని పొందిన మానవుడు జీవనతత్వంలో వాటిని అలవర్చుకోవాలని అన్నారు. గురుమార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. గురువులేని విద్య గుడ్డివిద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు. వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించాలని పేర్కొన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క.. నా శ్వాస అనే పేరుతో గత 16 సంవత్సరాలుగా లక్షలాది మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. తదుపరి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆలీషా ప్రారంభించారు. ఈ సందర్బంగా పదుల సంఖ్యలో పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు కుటుంబ సభ్యులతో కలిసి పీఠాధిపతికి వెండి పాదుకలు సమర్పించి పాదపూజ నిర్వహించారు. అనంతరం వందలాదిగా పీఠం సభ్యులు అలీషాకు పాదపూజ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ మాట్లాడుతూ సర్వమతాలు సమానమే అనే విషయాన్ని బోధించడానికి ఏర్పడిన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. ప్రతి మానవుని జీవితంలో మొదటి గురువు తల్లి తదుపరి తండ్రి అటుపై గురువు అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను గౌరవించకుండా గురువును ఆశ్రయించడం వల్ల ఫలితం ఉండదని తెలిపారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున నిరుపేదలకు కుట్టుమిషన్లు, మరియు పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి సమక్షంలో సభలో పంపిణీ చేసారు. ఈ సందర్బంగా అహ్మద్ ఆలీషా, రెడ్ క్రాస్ చైర్మన్ వై.డి.రామారావు, మెడికల్ ఆఫీసర్ దుర్గరాజు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.కనకారావు దంపతులు, పిఠాపురం పట్టణ సిఐ శ్రీనివాస్, టిడిపి సీనియర్ నేత వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. సభలో పీఠం సభ్యురాలు ఎ.ఉమ పర్యవేక్షణలో పలువురు పీఠం సభ్యులు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. ఈ సందర్భంగా 207 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎ.వి.వి.సత్యనారాయణ, ఎన్.టి.వి.వర్మ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.