తెలంగాణ పదం లేకుండానే బడ్జెట్
పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా గుండుసున్నా
తెలంగాణపై ఉన్న కక్షను బయట పెట్టుకున్న మోడీ
పోలవరం కోసం నిధులు ఇచ్చి…పాలమూరుకు ఇవ్వరా
విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకీ అన్యాయం
తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం
పార్లమెంటులో ఎంపిలు నిరసన తెలియచేస్తాం
కిషన్ రెడ్డి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలి
బడ్జెట్ కేటాయింపులపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష తో పాటు కక్షను కూడా ప్రదర్శించారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా దగా జరగలేదన్నారు. తాము పలుమార్లు ప్రధానిని, కేంద్రమంత్రులను కలసి విన్నివించినా..ప్రధాని
మోడీ పెద్దన్నగా అండగా ఉండాలని కోరినా తీవ్ర నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. దీనిపై రేపటి శాసనసభలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని అన్నారు. అలాగే తమ నిరసనలు కొనసాగిస్తా మని అన్నారు. 8 సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజల పట్ల మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగారని, ఇందుకు నిరసనగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రులు పొన్నం పరభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో కలసి కేంద్ర బడ్జెట్‌పై ఆయన విూడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని మండిపడ్డారు. ‘మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు దిల్లీకి వెళ్లారు. తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా నేను ప్రధానికి విజ్ఞప్తి చేశా. కానీ, తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పట్ల కక్ష కట్టారు. ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ రంగానికీ సహకారం అందించలేదు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారు.
బడ్జెట్‌లో బిహార్, ఏపీని మాత్రమే పట్టించుకున్నారు. ఇతర రాష్టాల్రను పట్టించుకోలేదు. 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు భాజపా పట్ల వివక్ష చూపలేదు. 8 సీట్లు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో ఉన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు? కేంద్రమంత్రి పదవి కోసం కిషన్‌రెడ్డి.. తెలంగాణ హక్కులను మోదీ వద్ద తాకట్టుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం.. పాలమూరు`రంగారెడ్డికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు?తెలంగాణపై కేంద్రం చూపించే వివక్ష మంచిది కాదు‘అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ’ ప్రధాని తెలంగాణకు వస్తే స్వాగతం పలికి పెద్దన్న పాత్ర పోషించమని అడిగాను. పెద్దన్నలా ఉండాల్సిన ప్రధానికి ఇది సరికాదు. ఢల్లీికి వెళ్లి కేంద్రాన్ని నిధులు అడిగాం. ప్రధాని మోదీని నేనే మూడుసార్లు కలిసి అడిగాను. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పాను. అయినా తెలంగాణకు అన్యాయం జరిగింది. మా మంత్రులు కూడా కేంద్ర మంత్రులను కలిశారు. 18 సార్లు ఢల్లీి వెళ్లి నిధులు ఇవ్వాలని కోరాం.. తెలంగాణ ఏర్పాటు పట్ల మోదీకి ఉన్న కక్షను మరోసారి చాటారు’ అని రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి ఎన్నిరకాలుగా కేటాయింపులు చేయాలో అన్ని రకాలుగా కేటాయించారు. ఏపీకి ఎందుకు నిధులు ఇస్తున్నారు..? అని మేం అడగడం లేదు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఏపీకి నిధులు కేటాయించారు. తెలంగాణ విషయంలో ఇంత కక్ష ఎందుకు?. గుజరాత్‌కు ఎలా నిధులు కేటాయించారో,మూసీకి అలా నిధులు కేటాయించామని ప్రధాని మోదీని అడిగాను. హైదరాబాద్‌కు నిధులు ఇస్తే దేశ ఎకానమికి ఉపయోగపడుతుందని మోదీకి వివరించాను. పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఐటీఐఆర్ కారిడార్ మరుగున పడిరది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ స్లోగన్ బోగస్ అని బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్‌లో మా రాష్ట్రం ఉండదా?’ అని కేంద్రంపై రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. ’కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్‌లాగా ఉంది. ఇంత కక్షపూరిత బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికల ముందే చెప్పాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించి మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది. తెలంగాణకి ఇవ్వండి అని లేఖ రాశాను. తెలంగాణకు ఐఐఎం ఇవ్వము అని ధర్మేంద్ర ప్రధాన్ మూడు రోజుల క్రితం
లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ కోసమే పెట్టినట్టు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మా ఎంపీలతో పార్లమెంట్‌లో నిరసన తెలియచేస్తాం. తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చూస్తూ ఊరుకోరు. ఏపీ పునర్విభజన చట్రంలో ఏపీకి ఇవ్వాల్సిన అంశాలతో పాటు తెలంగాణకి ఇవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. బడ్జెట్ సవరించే అవకాశం ఉంది. బడ్జెట్ సవరించి మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఫార్మా విలేజ్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలి. బీజేపీ చేతకానీ తనం, బానిస మనస్తత్వం వల్ల తెలంగాణ అన్యాయం అవుతోంది’ అని కేంద్రంపై రేవంత్ మండిపడ్డారు