శుద్ధి పనులకు రూ.4వేల కోట్లు కేటాయించాలి
కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌పురితో గ్యాస్‌పై చర్చ
తెలంగాణ ప్రభుత్వం రూ.1.5లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మురికి నీటి శుద్ధి పనులకు రూ.4వేల కోట్లు కేటాయించాలని పాటిల్‌ను కోరారు. రెండ్రోజుల ఢల్లీి పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే గోదావరి నదీ జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నింపే పనుల కోసం మరో రూ.6వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్‌కు నీటి కష్టాలు ఉండవని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా తెలంగాణ కు ఇంతవరకూ నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 7.85లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని ఇళ్లతోపాటు పీఎంఏవై అర్బన్, రూరల్ కింద చేపట్టే ఇళ్లకు సైతం నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. ఈ ఏడాది నుంచి తెలంగాణకు జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అంతకు ముందు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేసారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు.