లోక్ సభ స్పీకర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ సురేశ్ నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీల తరఫున లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లాకే మరోసారి అవకాశం దక్కింది. ఆయన మరికాసేపట్లో నామినేషన్ కూడా వేయనున్నారు. అయితే, స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఓ మెలిక పెట్టింది. కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇండియా కూటమి సభ్యులతో జరిపిన చర్చల్లో.. డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా పోటీకి సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీంతో ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్పీకర్ పదవి.. ఇప్పుడు తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.