ఇస్లాం మాసం సందర్భంగా ప్రత్యేక కథనం
మొహర్రం గ్రామీణ ప్రాంతాల్లో పీర్ల పండుగగా ప్రసిద్ధి. ప్రవక్త మనుమడు తన ప్రాణత్యాగంతో విశ్వజనుల శాంతియుత సహజీవనానికి శ్రీకారం చుట్టిన మాసం మొహర్రం. ఇస్లాం క్యాలెండర్లో మొట్టమొదటి మాసం కూడా ఇదే. దీన్ని కుల, మతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగలా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విశేషంగా శోక దినాలుగా పాటిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో మొహర్రంను 10 రోజుల పాటు వేడుకగా నిర్వహించుకుంటారు.
మొహమ్మద్ ప్రవక్త నిర్యాణం తర్వాత పాలనా బాధ్యతలు చేపట్టిన తొలి నలుగురు ఖలీఫాలు హజరత్ అబూబకర్ సిద్దీఖ్(ర అ), హజ్రత్ ఉమర్ ఫారూక్ (ర అ), హజరత్ ఉస్మాన్ (ర అ), హజరత్ అలీ (ర అ) ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించారు. అనంతర కాలంలో అధికారం కోసం పోరు ప్రారంభమైంది. ప్రవక్త ఆదేశాలనుసారం అబ్దుల్ మని తర్వాత ఖలీఫాగా ప్రవక్త అల్లుడైన హజరత్ అలీకి ఖిలాఫత్ దక్కాల్సి ఉండగా తద్విరుద్ధంగా రాజ్య భారంతో పాటు పీఠాధిపత్యాన్ని కూడా హజరత్ అమీర్ మావియా కైవసం చేసుకున్నాడు. ఆయన తదనంతరం హజరత్ అలీ ఖిలాఫతక్కు రాగా మావియా కుమారుడైన ఎజీద్ తన తండ్రి తర్వాత తనకు పరిపాలనతో పాటు పీఠాధిపత్యం కావాలని దేశంలో ఆందోళన సృష్టించాడు. హజరత్ అలీ తర్వాత ఆయన పెద్ద కుమారుడు హజరత్ ఇమామే హసన్ (ర అ)కు ఖిలాఫత్ దక్కింది. శాంతికాముకుడు, మానవతావాది, వివాద రహితుడు అయిన హసన్ దేశంలో నెలకొన్న అశాంతిని రూపుమాపేందుకు ఒక ఒప్పందం ప్రకారం ఖిలాఫత్ను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. దీంతో తనకు తానే రాజుగా ఖలీఫాగా ప్రకటించుకున్న ఎజీద్ దుష్ట పాలనకు శ్రీకారం చుట్టాడు. దుర్గు ణుడైన ఎజీద్ ప్రజలను పీడించడం, హింసించడంతో ప్రవక్త నబూవత్ పొందే నాటికి ముందు ఉన్న పరిస్థితులు పున: ప్రవేశించడం ప్రారంభమయ్యాయి.
ఇదంతా చూసి కలత చెందిన ప్రవక్త మనవడు హజరత్ ఇమామే హుస్సేన్ చర్చల ద్వారా పరిస్థితులను చక్కదిద్దడానికి మొహర్రం నెల మొదటి రోజున తన కుటుంబంతో సహా రాజధాని కూఫాకు బయలుదేరారు. ఆయన చర్చల కోసం రాజధాని చేరుకుంటే తన అధికారానికి ముప్పు తప్పదనీ, ఆయన బతికి ఉంటే తన మనుగడ అసాధ్యమనీ తలచిన ఎజీద్ వేలాది సైన్యంతో మార్గమధ్యంలోనే హుస్సేన్ బృందాన్ని అడ్డగించి కర్బలా మైదానంలో దిగ్బంధనం చేశాడు. ప్రాణం దక్కించుకోవాలంటే తనను రాజుగా అంగీకరించాలని, ఖిలాఫత్ అప్పగించాలని ఆదేశాలు జారీ చేశాడు. మూడు రోజులపాటు ఆహారం నీరు అందకుండా కఠిన ఆంక్షలు విధించాడు. అలా మొహర్రం నెల మొదటి ఆరురోజులు ప్రయాణించి కర్బలా చేరిన హుస్సేన్ బృందం మూడు రోజులు నిర్బంధంలో ఉంది. పదవ రోజు నాటికి ఎజీద్ సైన్యంతో భీకర పోరాటం చేయక తప్పలేదు.
అభం శుభం తెలియని ఏడాదిన్నర పసిబిడ్డ ‘అలీ అగ్జర్ దాహం తీర్చడానికి గుక్కెడు తాగునీరు అందించమని ఫిరాత్ నదిని దిగ్బంధనం చేసిన సైన్యాధ్యక్షుడు హుర్మిలాను కోరగా ఆ కఠినాత్ముడు కర్కశంగా బాణాన్ని పసివాడి అంగిటకు సంధిండంతో అసువులు బాసిన వైనం. చూశారు హుస్సేన్. అంతేకాక కళ్ళ ఎదుట శవాలుగా వడిన బంధువులను చూశారు. అంతే… తండ్రి నుంచి వారసత్వంగా లభించిన కరవాలం (జుల్ఫికార్) చేతబట్టి ఎజీద్ సైన్యంపై విరుచుకుపడ్డారు. వేలాది శత్రువు లను చీల్చి చెండాడుతూ శత్రు సైన్యం వైపు దూసుకెళ్ళడంతో శత్రు సైన్యం కకావికలమైంది. అయితే చుట్టుము ట్టిన శత్రు సైనికుల అస్త్రాలు అశ్వాన్ని నేలకూల్చి హుస్సేన్ శరీరాన్ని తూట్లు చేశాయి. రక్తసిక్తమైన శరీరంతో నేల కొరిగిన హుస్సేన్ చివరి నమాజుకు ఉపక్రమించగా ‘షుమ్రేలైన్’ ప్రవక్త మనమడి మెడ నరకడంతో ప్రపంచం నిర్ఘాంత పోయింది. శోక తప్త హృదయంతో గొల్లుమంది. ఆ ధర్మవీరుని రక్తంతో తడిసిన కర్బలా మైదానంలో రక్తం ఏరులైపారింది. క్రీ.శ.680 అక్టోబర్ 10 శుక్రవారం మొహర్రం నెల వదవ రోజు ఈ సంఘటన జరిగింది.
కర్బలా మైదానంలో షహదత్ (అమరత్వం) పొందిన వీరుల ఆత్మ శాంతికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఖురాన్ పటిస్తూ వచ్చే పుణ్యాన్ని కర్బలా వీరుల ఆత్మలకు అందించమని భగవంతున్ని కోరుకుంటారు. 2024 జూలై నెల 17న ‘యౌమే ఆషురా’గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు.
(జూలై 7న ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభం)…….