Hm9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా: ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పిల్లలు, టీచర్లు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపైనా విషం చల్లారు. అయితే, మధ్యాహ్న భోజన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ స్కూల్లో 30 విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు.శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది పాఠశాలలోని వంటగదికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది.. మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు. పాత్రలను శుభ్రం చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బంది చెప్పారు.తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.