కాకినాడ, జూన్ 28 : రాష్ట్రంలోని పలు పట్టణాలు నగరాలు గ్రామాల్లో డయేరియా ప్రబలమైనందున స్మార్ట్ సిటీలో డివిజన్ల వారీగా త్రాగు నీరు పరీక్షలు నిర్వహించాలని పౌర సంక్షేమసంఘం కోరింది. పలు ప్రాంతాల్లో 40 శాతం కుళాయి గొట్టాలు మురుగు కాలువల్లో ఉన్నాయన్నారు. అత్యధిక ప్రాంతాల్లో25శాతం లీకేజీ సమస్యలున్నాయన్నారు. త్రాగు నీరు లేత ఆకుపచ్చ రంగులో చేరడం వలన అవస్థలున్నాయన్నారు. ఇప్పటికే క్లాస్ ఏరియాల్లో మధ్య తరగతి నివసిస్తున్న ప్రాంతాల్లో బయటి మార్కెట్ నుండి సురక్షిత నీరు రోజువారీ కొనుక్కుంటున్న స్థితి కొనసాగుతున్నదన్నారు. రోడ్ల మీద బండ్లు, ఈట్ స్ట్రీట్ హోటల్స్, టీ బంకులు మున్నగు వాటిల్లో ఆహారంతో బాటుగా మంచినీరు కొనుకోవాల్సిన ధరావస్థ వుందన్నారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ త్రాగు నీటి సరఫరా గతం వలె సురక్షితంగా లేకపోవడం వలన నగరంలో 50 శాతం మంది మున్సిపల్ వాటర్ వాడడం లేదన్నారు. పేద సామాన్య ప్రజలు నివాసం వున్న ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ డంపింగ్ వాహనాల కేంద్రాలు డ్రైనేజీ ఔట్ లెట్ మేజర్ కాలువలు వున్నందున ఆయా ప్రాంతాల్లో సురక్షిత పారిశుద్ధ్యం ప్రజలకు లభించడంలేదన్నారు. నగరం బయటకు డంపింగ్ యార్డ్ యూనిట్లు తరలించాల్సిన అత్యవసరం వుందన్నారు. నగరంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వ ఆఫీస్ ప్రహారీల లోపల రోడ్ల మార్గాలకు చేర్చి జనతా షాపులు నిర్మాణం చేయిస్తే మురుగు కాలువల చెంత దుకాణాల నిర్వహణ చేయాల్సిన దుస్థితి ఉండదన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, త్రాగు నీరు లభించే ఏర్పాటు చేస్తే డయేరియా బెడద ఉండదన్నారు. నగర వ్యాప్తంగా కుళాయి పైపు లైన్లు మురుగు కాలువల్లో లేకుండా ప్రక్షాళన చేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రంగా వుండే బాధ్యతతో వున్నారని నగర పాలక సంస్థ ప్రజారోగ్య సంస్థ నగర జనాభాకు తగిన తగిన రీతిలో పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి నగర వ్యాప్తంగా రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణా సౌకర్యాలు సురక్షిత త్రాగునీరు అవసరాలు కల్పిస్తే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం స్మార్ట్ సిటీకి ఎంత మాత్రం వుండదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.
One Response
Super news