గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు గారు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు గారు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అరుదైన కళాకారుడని, వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం గారు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.