అసెంబ్లీ ముగిసేలోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయండి
లేకుంటే రైతులతో వచ్చి మేమే ఆన్ చేస్తాం
కెసిఆర్‌ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ డ్రామాలు
రోజుకు 2 టిఎంసిలు ఎత్తి పోసే అవకాశం
ప్రాజెక్టులను నీటితో నింపితే కరువుండదు
కాళేశ్వరంపై సర్కార్‌కు కెటిఆర్ అల్టిమేటమ్
బిఆర్‌ఎస్ బృందంతో కలసి పంపుహౌజుల పరిశీలన
వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే తలంపుతో పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ’దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు. గతంలో నీటి సమస్య ఉండేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నది. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్‌లో నీళ్లు లేవు, ఎల్‌ఎండీలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మిడ్ మానేరులోనూ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. శ్రీరాంసాగర్ సామర్థం 90 టీఎంసీలు అయితే ఇప్పుడు 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చు. 15 టీఎంసీలతో కొండ పోచమ్మ సాగర్ కట్టుకున్నం. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టుకున్నం. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయి. కాళేశ్వంరం దగ్గర గోదవారి ఉధృతంగా ప్రవహిస్తున్నది. రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయని అన్నారు. ఇంత గొప్ప సిస్టమ్ రూపొందించడం మరొకరి వల్ల కాదు. 17 పంపులు రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. రాజకీయ పరమైన నిర్ణయం వల్లే నీటిని ఎత్తిపోయడంలేదు. ప్రభుత్వం తలచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చు. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బస్వాపూర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్ రైతులు నీటికోసం ఎదురుచూస్తున్నారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట వరకు రైతులు కాళేశ్వర జలాల కోసం ఎదురుచూస్తున్నరు. ఆరు నెలలు రాజకీయం చేద్దాం.. నాలుగున్నరేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేద్దామని అన్నారు. నీటిని లిప్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయి. కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు నింపొచ్చు. మిడ్‌మానేరు గత
ఐదారేండ్లు నిండుగా ఉంది. ఇప్పుడు ఎడారిగా మారింది. పంప్‌హౌస్‌లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు ఈ విషయాలన్నీ అర్ధమైపోయినయి. రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తం. కాళేశ్వరంలో పరిధిలో రిజర్వాయర్లలో నీటిని నింపడానికి ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు గడువిస్తున్నాం. సర్కార్ స్పందించకపోతే 50 వేల రైతులతో తామే పంపులు ఆన్ చేస్తం. తెలంగాణ బీడు భూములకు నీళ్లు అందిస్తం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తం. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని ప్రపంచమంతా గుర్తించింది. ఎందరో మేధావులు కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రశంసించారు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్టుపై విషప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించాం. అన్నారం, సుందిళ్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. గ్రౌడిరగ్ అనేది నిరంతరం పక్రియ, 2020లోనూ చేశామని ఇంజినీర్లు చెప్పారు. రైతుల విూద కాంగ్రెస్ రాజకీయాలు బంద్ చేయాలి. కేసీఆర్ ఇంతగొప్ప ప్రాజెక్టును నిర్మిస్తే వాడుకునే తెలివి కాంగ్రెస్‌కు లేదు.’ అని కేటీఆర్ విమర్శించారు. న్నెపల్లిలో నీటి లభ్యత ఎక్కువ అని కేసీఆర్ గుర్తించారని, అందుకే అక్కడ పంప్ హౌస్ కట్టారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సమైక్య పాలకులు ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరిపై ఎక్కడా ప్రాజెక్టు కట్టలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో చిన్న లోపం.. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయన్నారు. ఆ చిన్న లోపాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండున్నర వేల క్యూసెక్కుల నీళ్లు వస్తే ఒక మోటర్ ఆన్ చేయొచ్చని తెలిపారు. నీటిని ఎత్తిపోస్తే చివరి సూర్యాపేట, డోర్నకల్ వరకు నీళ్లు అందించవచ్చని చెప్పారు. కేసీఆర్‌ను బద్నాం చేసి బతకాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అని ్గªర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే నీటి ఎత్తిపోతను ఆపారని ఆరోపించారు. ఎల్‌ఎండీ, మిడ్ మానేరులో టీఎంసీలకు పైగా నీళ్లుండేవని, ఇప్పుడు అసలు నీటి జాడే లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాళేశ్వరం నుంచి ప్రభుత్వం వెంటనే నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ వెంట సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.