ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం శోచనీయమన్నారు. మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం గమనార్హమని అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక అప్పా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు భారాన్ని మోపవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలని ఆయన కోరారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని పదేళ్లుగా కేంద్రం చెబుతోందని గురుమూర్తి అన్నారు. పోలవరానికి నిధులిస్తున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. పోలవరాన్ని నిర్దేశిత సమయంలోపు పూర్తి చేస్తామని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పార్లమెంట్‌లో వైసీపీ పోరాడుతోందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పదేళ్లుగా రాష్ట్రానికి ఆర్థికంగా ఫెసిలేట్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఎంత మేరకు సాయం చేస్తారనే విషయమై స్పష్టత లేదన్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి అవసరమైన నిధులు ఇస్తామన్నారే తప్ప, ఎంత ఇస్తారనే దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఏపీతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధిక ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని తేలితే వైసీపీ సమష్టి పోరాటానికి దిగుతుందని తిరుపతి ఎంపీ హెచ్చరించారు.