అక్రమిత భూముల రిజిస్టేష్రన్ నిలిపివేత
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ బ్రేక్ వేశారు. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరులకు నాటి అధికారులు ఈ భూములను కట్టబెట్టారు. అయితే, కొత్త ప్రభుత్వంలో వీరి అరాచకాలు, అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.తాజాగా స్థానిక రైతులు కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూములను కబ్జా చేశారని.. పెద్ది రెడ్డి అనుచరుల పేరిట ఆ భూములను రిజిస్టేష్రన్ చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్.. వెంటనే అన్యాక్రాంతమైన భూములపై ఫోకస్ పెట్టారు. ఈ భూములపై రివిజన్ పిటిషన్ వేయాలని ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పుంగునూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అన్నీఇన్నీ కావని స్థానికులు చెబుతున్నారు. అధికారం దర్పంతో తాను ఏం చేసినా చెల్లుద్దని.. ఇష్టారీతిన వ్యవహరించేవారని ఆరోపిస్తున్నారు. వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి దోపిడీపై, కబ్జాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.