– హైడ్రా నుంచి తనకూ నోటీసులు వచ్చాయన్న మల్లారెడ్డి
– తన కాలేజీలను కాంగ్రెస్ హయాంలోనే కట్టానని వెల్లడి
– తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందని వ్యాఖ్య
*మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి* సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల ఎవరికీ ప్రశాంతత లేదని, నిద్రలేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. హైడ్రా నుంచి తనకూ నోటీసులు వచ్చాయని తెలిపారు. యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన కాలేజీలను కాంగ్రెస్ హయాంలోనే నిర్మించానని వెల్లడించారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్ల మీద పడేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమే అన్నారు. తెలంగాణలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏదో యుద్ధం చేసినట్లుగా ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు.