సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను కించపరుస్తూ ట్రోల్ చేయడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ట్రోలింగ్‌ను ఖండిస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు దండలు వేసిన ఆడవాళ్లను అలాగే చూస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కొత్త సంస్కృతికి తెర తీస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కొండ సురేఖకి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంలో ఆమె తప్పు లేదన్నారు.
*క్షమాపణ చెప్పాల్సిందే..*
“కొండా సురేఖ విషయంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సింది. బీఆర్ఎస్.. సోషల్ మీడియాని కంట్రోల్ చేయకపోవడం తప్పు. పుండు మీద కారం చల్లినట్టు కేటీఆర్ చేశారు. అసలే మంత్రి ఫైర్ బ్రాండ్.. ముట్టుకోకుంటే ఏం అనదు. తెలిసి కూడా ఎందుకు ఆమె జోలికి ఎందుకెళ్లారు. బీఆర్‌ఎస్‌కు కొంచం కూడా పరిజ్ఞానం లేకపోవడం బాధాకరం. ఆ పార్టీ వాళ్ళు పదేళ్లు రాజభోగాలు అనుభవించారు కదా. ఇంకో పదేళ్ల పాటు ఓపిక పట్టు కేటీఆర్.. పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకో. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా మిగలొద్దు. కొండా సురేఖకు క్షమాపణ చెప్పు. కేటీఆర్ తప్పు చేసి డిస్ట్రబ్ చేసి.. ఆమెకు అనే అవకాశం మీరే ఇచ్చారు. ఇంట్లో ఉన్న ఆమెని రెచ్చగొట్టి.. తన్నించుకుంటున్నారు. కొండా సురేఖతో కొట్లాడుడు అంత సులభం కాదు. రాహుల్ గాంధీపైనా కేటీఆర్ నిందలు వేస్తున్నారు. ఇది సరికాదు. గాంధీ కుటుంబం గురించి ప్రజలకు బాగా తెలుసు. 52 ఏండ్లు దేశాన్ని పాలించింది రాహుల్ గాంధీ కుటుంబం. వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ భవనాలే. మీరు సంపాదించింది మీ నాన్న లాగే కదా. పనికి మాలిన మాటలు మాట్లాడితే ఖబర్దార్. రాహుల్ గాంధీ పై అబండాలు వేస్తే ఊరుకోం” అని జగ్గారెడ్డి అన్నారు.