చెస్ క్రీడలో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిగా ‘లైవ్ చెస్ రేటింగ్స్‌లో 2800 పాయింట్ల మార్కు’ను దాటేసిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. సెర్బియా వేదికగా జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో అర్జున్ గారు సాధించిన ఈ ఫీట్ అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. వెటరన్ గ్రాండ్ మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గారి తర్వాత లైవ్ చెస్ రేటింగ్ 2800 పాయింట్స్ దాటిన రెండో భారతీయుడిగా వరంగల్ యువతేజం అర్జున్ ఎరిగైసి రికార్డు నెలకొల్పడం సంతోషకరమని, ప్రపంచంలో ఇప్పటిదాకా ఈ ఫీట్ సాధించినవారు కేవలం 16మందే ఉండటం విశేషమని సీఎం గారు పేర్కొన్నారు.
కొద్ది రోజుల కిందట బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ స్వర్ణం గెలవడంలో అర్జున్ గారు కీలక పాత్ర పోషించడం, టీమ్ అందరూ ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తలా రూ. 25లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.