కామారెడ్డి , సెప్టెంబర్ 17: ధరణి పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ధరణి, ఓటర్ ఇంటింటా సర్వే, ప్రజావాణి, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న ధరణి ఫైళ్లను సత్వరమే పూర్తి చేయాలని తాసిల్దారులను ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు తాసిల్దార్ కార్యాలయాలలో పెండింగ్ లేకుండా చూడాలని కోరారు. ఇంటింటి సర్వే ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 26 లోగా 100% సర్వే పూర్తయ్యే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. రాష్ట్రస్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. జిల్లాస్థాయి ప్రజావాణిలో దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. నాలుగు రోజుల్లో ప్రజావాణి దరఖాస్తులను 100% పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూములు అక్రమణకు గురి కాకుండా అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడైనా అక్రమణకు గురైనట్లు తెలిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమణ నకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సివిల్ సప్లై అధికారులతో సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డివో లు రంగనాథరావు, ప్రభాకర్, ఏవో మసూర్ అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సుమలత, స్వప్న, సరళ, ఇందిరా ప్రియదర్శిని, తాసిల్దార్లు, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.