కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాకినాడ అటవీశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రవీంద్రనాథ్‌రెడ్డి.. మైనింగ్ వాహనాల విషయంలో కొన్ని రకాల ఆంక్షలు విధించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన పేషీలోని ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారి పేర్లు చెప్పి.. మైనింగ్, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ విచారణకు ఆదేశించారు.