-అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించబోతోంది..
-ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యన ఎండగట్టాలి
-క్షేత్ర స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేయండి
-పార్టీ అనుబంధ సంఘాలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం
గ్రామ స్థాయిలో పార్టీ బాగుంటేనే మనం అందరూ బాగుంటాం.. కష్టపడి పనిచేద్దాం.. కసిగా పోరాడుదాం.. కలసి ముందుకు నడుద్దాం.. అప్పుడే అద్భుతమైన విజయం మనకు లభిస్తుంది.. అబద్ధాలు చెప్పి అందలమెక్కిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యన ఎండగట్టాలి.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి అనుబంధ సంఘాల నేతలు అందరూ సంఘటితం కావాలి.. అధినాయకత్వం ఒక పిలుపు ఇస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు అందరూ బయటకు రావాలి.. అప్పుడే మన సత్తా ఏమిటో పాలకులకు తెలుస్తుంది.. అంటూ వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
విజయవాడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలతో వైఎస్ జగన్ బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులను రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధినేతకు పరిచయం చేయగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించిన జగన్ అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. వైఎస్ జగన్.. అనే ‘నేను మీ ప్రతినిధిని మాత్రమే.. కష్టపడి పనిచేసి, నష్టపోయిన వారికి అండగా ఉంటా. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. అందు కోసం పార్టీ ఒక్క పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది వరకు అంతా కదలి రావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి’ అని సూచించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని, పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. చివరగా పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్ళే అంశంపై ముఖ్య నేతల సలహాలు, సూచనలను స్వీకరించిన ఆయన ఇకపై దూకుడు పెంచాల్సిందే అని అక్కడకు వెళ్లిన పార్టీ నేతలను ఉత్తేజ పరిచారు.