బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ:::
రాహుల్ గాంధీకి, హైడ్రాకు సంబంధం లేదన్న పీసీసీ చీఫ్
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చివేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే వారు హైడ్రా కూల్చివేతలకు భయపడుతున్నారన్నారు.
అసలు రాహుల్ గాంధీకి, హైడ్రాకు సంబంధం ఏమిటి? అని నిలదీశారు. ఇంకా డీపీఆర్ రూపొందించని ప్రాజెక్టులో అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని, ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం తీసుకు వస్తామన్నారు. కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని కేటీఆర్‌ను ప్రశ్నించారు.