“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
* టీఎస్‌పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నీటి పారుదల శాఖ కార్యాలయం జల సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు షబ్బీర్ అలీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా AEEలను ఉద్దేశించి సీఎంగారు పలు సూచనలు చేశారు.
* రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణాలేంటో గమనించాలి.
* హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకోండి.
* గడిచిన పదేళ్లలో రెండు లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కారాదు.
* ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్నవారే రాణిస్తారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంజనీర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
* తెలంగాణ పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం. దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.
* కార్యక్రమ ముగింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, జలసౌధకు వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనని చెప్పారు.